Nirantara Atma Chintana (నిరంతర ఆత్మ చింతన) | Lyrical Song - 119 | Phalguna Pournami Special song
ฝัง
- เผยแพร่เมื่อ 23 ม.ค. 2025
- ఈ జగతిలో కర్మగల ప్రతి జీవరాశికి, ఆ కర్మను అనుభవించుటకు పాంచభౌతిక దేహము తయారుచేయబడుతుంది. మూడు ఆత్మలు గల సజీవ దేహములో, కర్మను అనుభవించువాడు జీవాత్మ కాగా, కర్మను కార్య రూపము చేసి అనుభవింపజేయువాడు ఆత్మ. ఇక వీరిరువురిని సాక్షిగా చూసేవాడు పరమాత్మ అని తెలియవలెను.
గుణకర్మను అనుభవించుటయే తన పనియని భ్రమిస్తున్న జీవాత్మకు, నిజానికది పరాయి పనియే. మరి ఆ జీవుని స్వంత పని ఏది! అనగా "నిరంతర ఆత్మ చింతనచే తనను తాను తెలుసుకొనుటయే". అదే జీవునికి స్వధర్మము. దేవుడు భగవంతునిగా వచ్చి, చింతింపతగనిదైన ప్రాకృతిక విషయములకై చింతను మానుకొని, అన్యచింతనలేక చింతింపతగినదైన "ఆత్మ" చింతనలోనే ఉండమని, జీవునికి హితము చెప్పగా, వ్యర్థచింతలలో పడిపోయిన జీవుడు, ఆ గురు హితబోధలన్నిటినీ పెడచెవినబెట్టి గుణకర్మములనే చెరలోనే చిక్కిపోతున్నాడు.
మహాయోగియైన శ్రీ వీరబ్రహ్మేంద్రుల వారి తత్వములో ఈ విధముగా చెప్పియున్నారు "అంతఃకరణ బజారులోన సంత జరుగునండి, నర సంత జరుగునండీ, మాయా సంత జరుగునండి ! చింతలేని అంతమ్మకు సంతలో నిద్ర వచ్చెనండి, నిజ నిద్ర వచ్చెనండీ, యోగా నిద్ర వచ్చెనండి !! " చూసారా! మనో బుద్ధి చిత్త అహంకారములనే అంతఃకరణములు, ఎన్నో ప్రాపంచిక చింతలను జీవునివైపుకి తీసుకొని వచ్చి, ఆ జీవ ధ్యాసను మాయవైపుకు మరలించాలని చూసినా, ఆత్మపై అచంచలమైన శ్రద్ధ గల్గిన జీవుడు అనన్యమైన ఆత్మ చింతతో కూడినదానివలన, రణగుణధ్వనులతో నిండిన సంతవంటి ఆ బజారులో కూడా నాలుగు దారులు కలిసే చావిడిలో నిశ్చింతగా (యోగ) నిద్రపోతున్నాడు (ఆత్మానందం పొందుచున్నాడు). అదియే జీవునికి స్వంత పని.
నిరంతర ఆత్మ చింతనచే తనను తాను తెలుసుకొనుట - జీవునికి స్వంత పని, కాగా
స్వతంతర జ్ఞాన చింతనలో తనను తాను కలుసుకొనుటయే - జీవునికి స్వంత సేవ
స్వ అను పదమునుండి సేవ అను పదము పుట్టినది. కనుకనే భగవద్గీతలోని జ్ఞానయోగము మొదటి శ్లోకములో జ్ఞానసేవ చేసి "ఆదిత్యుడైన" సూర్యుని "వివస్వ" అనే పేరుతో సంబోధించారు. ఇంకనూ 34వ శ్లోకములో "పరిప్రశ్నేన సేవయా" అని, ఆత్మసంయమ యోగములోని 20 లో "యోగసేవయా" అని, గుణత్రయ విభాగ యోగములోని 26 లో "భక్తియోగేన సేవతే" అని, ఈ సేవను గూర్చియే ప్రబోధించియున్నారు.
గురువు ప్రబోధించిన ఆత్మ బోధను విన్న జీవుడు, ఆ జ్ఞానమును గ్రహించి, ఆ ప్రబోధకు తగు "సేవ" చేయవలయును. సేవ అనగా "స్వచ్చందముగా చేయునది", "స్వేచ్ఛతో కూడినది". స్వంత ఇచ్ఛయే "స్వేచ్ఛ" దానినే శ్రద్ధ అని అనవలెను. శ్రద్ధ ఎవరి ఇష్టానుసారము వారికీ పుట్టునది. స్వయముగా పుట్టునది "స్వయంభూ" కావున అది జీవుని స్వేచ్ఛ అని తెలియవలెను.
జ్ఞానము శ్రద్ధానుసారము లభ్యమగును, కావున స్వతంతరమైన జ్ఞాన చింతనయే జీవునికి నిజమైన సేవ, దానితో జరుగు నిరంతర ఆత్మచింతనయే జీవునికి నిజమైన స్వంత పని.
గురువు శిష్యుని కొరకు "ఆత్మ"జ్ఞాన బోధ చేయగా... శిష్యుడు గురువుని చేరుట కొరకు "ఆత్మ"చింతన చేయవలెను. జీవాత్మను పరమాత్మలో చేర్చుటకు గురువు సారధి కాగా, ఆత్మ వారధి అని తెలియవలెను.
TEAM:
-------
Lyricist - Siva Krishna Kogili
Singer - Naveen
Music - N R Chaitanya Kumar
Editing - Subbu
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel
LYRICS:
సాకీ :
నిరంతర ఆత్మ చింతనతో నిన్ను నీవు తెలియడమేరా నీ స్వంతపని
పల్లవి :
నిరంతర ఆత్మ చింతనచే నిన్ను నీవే తెలుసుకోరా..
స్వతంతర జ్ఞాన చింతనలో నిన్ను నీవే కలుసుకోరా..
నిరంతర ఆత్మ చింతనతో నిన్ను నీవే తెలుసుకోరా..
స్వతంతర జ్ఞాన చింతనలో నిన్ను నీవే కలుసుకోరా..
త్రైతమే పాత్రగా చేసి క్రొత్తగా గాత్రమే పోసి
అంతమే నీవు కోరేసి స్వంతపనిలో మునిగిపోరా... ఆత్మతోనే కలిసిపోరా
చర1 :
పనులు మానేసి కొందరు చేసినారట దొంగ సన్న్యాసం
మనసులో బాహ్య చింతలు వీడనప్పుడు ఎందుకావేషం
పనులు చేసేటి మేమే యోగులం అని కొందరి ఉద్దేశ్యం
ఆత్మపై ధ్యాసలేక యోగమంటూ దేనికా మోసం
లోకమను ప్రయాసలో పడి భారాలనే విడు లోచనే రాక
దైవమను ధ్యాసన్నదే విడి బంధాలతో చెడి దీనుడయ్యావు
తనువులో రేగేటి ఆశలు మూగేటి ఊసులు పొల్లు పోనీక
తపనతో కూడేసి లోతుగ సాగేటి ఊపులనాపనేలేవు ... ఊహలు ఆదుకోలేవు ...
అందుకే త్రైత భావాన్ని ... ముందుగా చేదుకోవాలి
రాతలో రాజయోగాన్ని ... గీతలో అందుకోవాలి
జీవ ఆకర్షణే ఆపి ...భావమే ఆత్మపై మోపి
ఖర్మకే సాంఖ్యమే చూపి.. స్వంతపనిలో మునిగిపోరా... ఆత్మతోనే కలిసిపోరా
నిరంతర ఆత్మ చింతనచే నిన్ను నీవే తెలుసుకోరా..
స్వతంతర జ్ఞాన చింతనలో నిన్ను నీవే కలుసుకోరా..
చర2 :
దేహభాగాలు ప్రతి పని కర్మ వశమున చేయుచూవుంటే
అహముతో కూడు జీవుడు ఆత్మవాసము చేయనేలేడు
కర్మలే మాయగుణమల బాణములు సంధించి వేస్తుంటే
ధర్మమే లేని జీవికి ఆత్మతో సంధే కుదరబోదు
పొరుగులో ఉండేటి ఆత్మను అందేటి భావము బుద్ధిలో లేక
ప్రతి పనీ చేసేది తానను అహాన జీవుడు బద్దుడైనాడు
శిరములో మ్రోగేటి వాక్యము వినేటి శ్రద్ధను పెంచుకో లేక
పరులకై తపించు మోహము వరించి.. పరుగుకు సిద్ధమైనాడు... హద్దును మీరిపోయాడు
అందుకే మోహ భావాన్ని... ముందుగా తెంచుకోవాలి
వార్తలో ఆత్మయోగాన్ని... వాక్కులో ఎంచుకోవాలి
అహమనే ఊటనే మూసి... ఇహములో ఊరకుండేసి
కాయమే ఖర్మకొదిలేసి స్వంతపనిలో మునిగిపోరా... ఆత్మతోనే కలిసిపోరా
నిరంతర ఆత్మ చింతనచే నిన్ను నీవే తెలుసుకోరా..
స్వతంతర జ్ఞాన చింతనలో నిన్ను నీవే కలుసుకోరా..
చర3 :
నియత కార్యాలు విధిగా నిర్ణయించే చిత్తమే ఉంది
స్వంతగా నీవు మళ్ళీ చింత చేస్తే అర్థమేముంది
వర్తమానాన్ని నడిపే కర్తగా మధ్యాత్మ తోడుంది
భవితకై నీవు వేసే ఎత్తులన్నీ వ్యర్థమేనంది
విధికి తల వంచేసి తలపులు తెంచేసి దేహపు ధ్యాసయే లేక
మదికి మరి మధ్యాత్మ మంత్రము రివాజుగా అభ్యాసమవ్వాలి
గాలికే అల్లాడు మనసును పిల్లాడిలా పరిగెత్తి పోనీక
వేళకే అల్లా స్మరణయే నమాజుగా అలవాటుచేయాలి... ఆత్మగా మారిపోవాలి
దేహమేఆసనానున్నా.. నీకు ఉపవాసమేనన్నా
సప్త ఆకాశముననున్న... ఆత్మయే నీకు వశమైన
అంతరాయాలు లేనట్టి... చింతనే ఆత్మపై పెట్టి
కర్మయోగాన్ని చేపట్టి.. స్వంతపనిలో మునిగిపోరా... ఆత్మతోనే కలిసిపోరా
నిరంతర ఆత్మ చింతనచే నిన్ను నీవే తెలుసుకోరా..
స్వతంతర జ్ఞాన చింతనలో నిన్ను నీవే కలుసుకోరా..