Sivanandalahari (శివానందలహరి) | Lyrical Video - 139 | Singer: Vagdevi | Mahaa Siva Raathri Spl Song
ฝัง
- เผยแพร่เมื่อ 7 ม.ค. 2025
- జ్ఞానవాహిని శ్రోతలకు, వీక్షకులకు అందరికీ "శివరాత్రి" పర్వదిన సందర్భముగా శుభాకాంక్షలు.
మాఘమాసములో పండుగ పాటను విని ఆనందిస్తున్న వారికి పండుగా మారిన పిదప మాఘమాస అంత్యములో శివరాత్రి ఏర్పడక తప్పదు. కాయ పండుగా మాగి పక్వమైన తర్వాత ఒకనాడు చెట్టు నుండి విడిపోక తప్పదు. చెట్టు నుండి విడువడినా, విడువడకపోయినా పరిపక్వమైన పండు శివమైనట్టే. అట్టి పండు ఇక రకరకముల రుచులను రసించక, ఒకే శివమనే రుచినే తనలో తీపిగా నింపుకుని, అదే ఒక శివమై మన ముందర నిశ్చలమై నిలబడుతుంది. ఈ జ్ఞానమును తెలిసిన పెద్దలు మాఘమాసము పూర్తి అవుతూనే శివరాత్రి వచ్చేలా నిర్ణయించారు. కాబట్టి త్రిగుణ రహితమైన ఆ శివము "శివరాత్రి"గా మన ముందుకు పండుగ పాట తరువాత రావడము దేవుని సంకల్పము అని అనుకుంటున్నాము.
కాలములో కదులు ప్రతిదానికీ ఒక ముగింపు ఉంటుంది. జీవునికి కదిలేటప్పుడు లేని ప్రశాంతత కదలక అంత్యమైనప్పుడు కల్గును. జీవుడు చరించేటప్పుడు లేని విశ్రాన్తి చలనములేని అచలనమైనప్పుడు పొందును. కావున, అంత్యమునకు (మరణమునకు, మృత్యువుకు, మిత్తికి, చావుకు) శివమునకు మధ్యనగల ఒక యోగానుభూతిని ఈ గీతము చాటుచున్నది. అదే యోగనిద్ర, మరుపులేని మరణము, యెఱుకయున్న ప్రళయము.
హర్షము అనగా సంతోషము. అందుకే యోగికి మహర్షి (గొప్ప సంతోషి) అంటుంటారు. యోగి అనుభవించు ఆత్మానుభూతి మాటలకందని అనుభవము, అట్టిదానిని అనుభవములన్నిటిలోకీ గొప్పదైన "ఆనందము" అని వర్ణించారు. యోగమును అనుభవించువానిని "ఆనంద" అనవచ్చును. తనలో జరుగుచున్న యోగముయొక్క పరిపక్వమును బట్టి ఆ యోగి రాజానంద, దేవానంద, బ్రహ్మానందగా మారవచ్చును. "ఆనంద" ఐన "ఆత్మ" జ్ఞానయోగ్యత గల్గిన జీవాత్మకు స్వాత్మానుభవమును ఇచ్చుచూ ఆనందస్థాయిలను పెంచుచూపోవును. జీవాత్మ ఆత్మజ్ఞానమును సంపూర్ణముగా తెలియగల్గి, పూర్ణాత్మయైన శిష్యునిగా మారి, గురుప్రబోధమును అనుభూతిచెందుటయే "ప్రబోధానందము". అదే సమయమున తనబోధను సంపూర్ణముగా గ్రహించుకోగల శిష్యునికి ఆ గురువు తననే ప్రబోధముగా చేయుచూ పొందు ఆనందమే "శివానందము".
ఇలా గురువుస్థానము నుండి బయలుదేరివచ్చిన "ప్రబోధానంద తరంగం" శిష్యుని హృద్దేశమను తాకి, అతనిని తరింపజేయుటకై "శివానందలహరి"గా మారుచున్నది. ఇట్టి జ్ఞానప్రబోధమునకు, నిర్గుణశివమునకు మధ్య "ఆనందము" అను వారధిగాయుంటూ, ఈ సర్వ సృష్టికీ మధ్యాత్మ మహత్తును చాటుచున్న "త్రైతశకమునకు" ఇదే మా హృదయపూర్వక ఆహ్వానము.
మాస శివరాత్రి - మహా శివరాత్రి:
సంవత్సరానికి కల 12 మాసములలో, ప్రతిమాసమూ కృష్ణపక్ష చతుర్దశి తిధిన మాసశివరాత్రిగా గుర్తించి చేయుట చూస్తున్నాము. అలా చేయువాటిలో చివరిదైన రాత్రిని "మహా శివరాత్రి" పండుగగా జరుపుకుంటున్నాము. కావున, ఒక జీవుడు గురుపుత్రుడైన సంవత్సరుడు కావాలంటే, అతను ప్రతిమాసమూ త్రిగుణరహితుడై, చతుర్దశిగా (సప్త నాడులు సప్త గ్రంథులపై) వేచియుండి, తనలో ఆ గురువును సంపూర్ణముగా మూసపోసుకొన వలెను అని తెలియుచున్నది.
అలా సప్త కాడులు దాటి, అష్టమిగా మారుటకు గుర్తుగా ఈ శివరాత్రి "8 "వ తారీఖున వచ్చేలా గురువు ఆశీర్వదించినారు. అట్టి గురుదేవునికి ఇవే మా సాష్టాంగ దండ ప్రణామములు !!!
TEAM:
Lyricist - Siva Krishna Kogili
Singer - Vagdevi
Music - NR Chaithanya Kumar
Video Composition - Subbu
Lyrics Editing - Kishore P
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel
సాకీ:
శివతత్త్వమై ప్రబలిన దేహములో జీవాంత్యమై మిగిలిన పయనములో
త్రైతాత్మలై కదిలిన ప్రయాణముగా గురుతత్త్వమే శివాత్మకమై చేయు ప్రబోధాత్మజమే
ఈ శివానందలహరి శివానందలహరి శివానందలహరి
పల్లవి:
చిత్తే సత్తుకై గుత్రములే వీడగా జీవశ్చవమదే శుద్ధశివంరా
సత్తే చిత్తుతో త్రైతముకై కూడగా సచ్చిదనందమే సదాశివంరా
చిత్తే సత్తుయై గుత్రములే వీడగా జీవశ్చవమదే శుద్ధశివంరా
సత్తే చిత్తులో త్రైతముకై కూడగా సచ్చిదనందమే సదాశివంరా
సప్తముగా నాడులు తప్తమవ్వగా వృత్తముగా గ్రంథులు షుప్తమవ్వగా
సత్తూచిత్తులు తుది తత్వమొందగా విత్తనమే లేని ఈశ్వరుడే శివశక్తుల పొత్తులలో అవతరించుగా
శివానందలహరి శ్రీ శివానందలహరి శివానందలహరి సచ్చిదానందలహరి
చిత్తే సత్తుకై గుత్రములే వీడగా జీవశ్చవమదే శుద్ధశివంరా
సత్తే చిత్తుతో త్రైతముకై కూడగా సచ్చిదనందమే సదాశివంరా
శుద్ధ శివానందలహరి ఇది సచ్చిదానందలహరి
చ1:
జాగృతిలో దేహం పాత్రలు మార్చగా స్వప్నములో మోహం ఏమార్చేనురా
నిద్దురలో సైతం ఎరుకను వీడని సిద్ధుడవై త్రైతమ్ గుర్తునుండరా
కర్మలతో కాయం కదులుచునుండగా గుణములలో గాయం అనుభవాలురా
జ్ఞానముతో కాలి కాలము గడుపుచూ ధ్యానములో కలివై గురునికూడరా
మనసో మాయల మంత్రం మహిలో కాదది స్వంతం
మరణమె చక్కని తంత్రం మరచిపోకురా
తిత్తిలో భావాల జాలం సత్తుకే వేసెను తాళం
మిత్తిలో దాగుంది మూలం తెరచిచూడరా
మననాలే ఖననాలౌ అవసానములో
హృది శివమై శయనించును నీ సమాధిలో జీవస్సమాధిలో
చిత్తే సత్తుకై గుత్రములే వీడగా జీవశ్చవమదే శుద్ధశివంరా
సత్తే చిత్తుతో త్రైతముకై కూడగా సచ్చిదనందమే సదాశివంరా
//సదానందలహరి ...సచ్చిదానందలహరి
చ2:
కర్మలనే భారం కాయముకొదలరా ధర్మమనే కళేబరం ధరించెయ్యరా
ముక్తియనే తీరం చిత్తము కందగా మృత్యువె ఆధారం మరలిచూడరా
మరణిస్తూ గుణముల రణమే చేయరా స్మరణిస్తూ ఆత్మలో జీవమొందరా
మృతుడయ్యే యోగం ధృతితో బూనగా స్మృతిలోనే గురువై మరలబ్రతకరా
కాయమే కూలే స్ఫురణం ధ్యేయమై నీలో కరణం
కాలుడై ఏలే తరుణం ఎరిగివుండరా
జీవలో కాల్చై అహం దైవమై దాల్చై దేహం
శ్వాసకే శ్వాసై సోహం జరుపుచుండరా
శిశుశివమే గురువశమౌ వశికరణములో
శశిదశలే శతమొందును ఆనందములో ప్రబోధానందములో
చిత్తే సత్తుకై గుత్రములే వీడగా జీవశ్చవమదే శుద్ధశివంరా
సత్తే చిత్తుతో త్రైతముకై కూడగా సచ్చిదనందమే సదాశివంరా
చిత్తే సత్తుయై గుత్రములే వీడగా జీవశ్చవమదే శుద్ధశివంరా
సత్తే చిత్తులో త్రైతముకై కూడగా సచ్చిదనందమే సదాశివంరా
అంతఃకరణాలే ఆవిరవ్వగా అంతఃకాలమదే చేరువవ్వదా
అంతరగర్భానే జీవమొందగా అంతట వ్యాపించిన ఈశ్వరుడే అణువంతై జీవభగములో ఆవిర్భవించుగా
//శ్రీ శివానందలహరి .. సచ్చిదానందలహరి
చిత్తే సత్తుకై గుత్రములే వీడగా జీవశ్చవమదే శుద్ధశివంరా
సత్తే చిత్తుతో త్రైతముకై కూడగా సచ్చిదనందమే సదాశివంరా !