బ్రహ్మసాగర్ మునకలో వేల కోతులు జలసమాధి అయిన నారాయణ స్వామి మఠం..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • #Brahmasagar #Dam #Water #Rayalaseema #Kadapa #Nature #Monkeys #Death #Narayana #Swamy #Mattam #Badvel #Mydukuru #BMattam
    నారాయణస్వామి మఠం..
    ఎలమోరి కొండను నల్లమలకు కలుపుతూ బ్రహ్మంగారి మఠం దక్షిణ దిక్కున తూర్పు పడమరలుగా ఆనకట్ట ఒకటి కట్టారు. అదే బ్రహ్మసాగర్.
    నల్లమలనుంచి లంకమలకు బయల్దేరిన పులి కొత్త దోవ వెతుక్కుంది. తరాలుగా మట్టితో పెనవేసుకున్న అనుబంధాన్ని తెంచుకుని కొత్త తావులకు మూటె ముల్లె సర్దుకున్నారు బసవాపురం, ఓబులరాజు పల్లె, జంగంరాజు పల్లె, కొత్తపల్లె, చీకటివారి పల్లె, మరో రెండు. మొత్తంగా ఏడు పల్లెల జనాలు. జనాలతో పాటే గొడ్డూ గోదా మేక గొర్రె.
    క్రిష్ణా నది నుంచి బయల్దేరిన తెలుగుగంగ బ్రహ్మసాగర్ నేలకు నీళ్ల దుప్పటి కప్పుతోంది. అన్నాళ్ల స్వేచ్ఛా వాయువులు లాగేసినట్టు ఎరుపెక్కాయి నీళ్లు.
    రాళ్లూ రప్పలు
    చెట్టూ చేమలు
    గుంతలు మిట్టలు సదరం చేస్తూ అంతకంతకూ పెరుగుతున్న నీళ్లను మనిషి అర్థం చేసుకున్నట్టుగా మిగతా జీవులు అర్థం చేసుకోలేవు.
    పిట్టలు రెక్కలమింద ఎగిరిపొయ్యాయి.
    బెదిరిన పాములు, కుందేళ్లు, ముంగీసలు వంటి వన్యప్రాణులు కొత్త తావులకు పరిగెత్తాయి.
    ఈ రెండింటి మధ్యన పల్లెను నమ్ముకుని బతుకుసాగించే వానరాలు మాత్రం మనిషి వెంట నడవలేకపొయ్యాయి. నీళ్లు అంతకంతకూ పెరిగే కొద్ది చెట్లు ఎక్కుతూ చివరికి చిటారు కొమ్మకు చేరాయి.
    నీళ్లు పెరగడం ఆగాయి. కోతులు చెట్ల చివరి అంచున మిగిలాయి.
    చుట్టూ ఎటు చూసినా నీళ్లే.
    గుంతలు చెరువులకే బితుకు బితుకుమనే కోతులకు సముద్రంలాంటి డ్యాం అంతుబట్టలేదు.
    బుడుక్ బుడుక్ అంటూ చెట్టును తాకే ఒక్కో అల
    కోతుల గుండెను అదరగొడుతున్నాయి. మరో వైపు ఆకలి. కేర్ కేర్ మనే కోతుల అరుపులన్నీ బ్రహ్మసాగర్ నీళ్లల్లో నిక్షిప్తమైపోతున్నాయి.
    కోతుల బాధ చూడలేక నాటు పడవల్లో ఆహారం తీసుకెళ్లారు కొద్దిరోజులు. ఆకలి తీర్చడానికి ఒకటా రెండా..! కొన్ని వేల కోతులు. డ్యాం కట్టమీది నుంచి అయిదారు కిలోమీటర్లు ఉంటుంది. రోజూ తీసుకెళ్లాలంటే అవ్వదు.
    మెల్లగా కోతుల అరుపులు తగ్గాయి.
    ఒక్కొక్కటే చెట్ల కొమ్మలనుంచి నీళ్లల్లో ఒరిగాయి. అలలు పాడె కట్టి, కోతుల శవాలను బ్రహ్మసాగర్ నడిమధ్యన తిప్పకు చేర్చాయి.
    అది నారాయణస్వామి మఠం.
    2006 లో వైయస్సార్ ముఖ్యమంత్రిగా సోనియాగాంధీ చేతుల మీదుగా బ్రహ్మసాగర్ ను ప్రారంభించారు. అప్పట్నుంచి ఎన్నిసార్లు అక్కడికి వెళ్లినా నారాయణస్వామి మఠం, కోతులు, తిప్ప దృశ్యాలు కళ్ళముందు కదలాడుతూ ఉంటాయి.
    చెరువు కట్ట మాటి మాటికి తెగిపోతుంటే అది చూడలేక పెళ్లి కాని స్త్రీ చెరువు గండిలో దూకి ఆత్మార్పణ చేసుకోవడం, తర్వాతెప్పుడూ కట్ట తెగలేదని పెద్దోళ్లు కథలుగా చెప్తుంటారు. బ్రహ్మసాగర్ డ్యాంకు వేల కోతులు తమ జీవితాలను అర్పించాయి. వాటికోసం ఏ పండగ చెయ్యాలో మరి..!
    2016 లో డ్యాం డెడ్ స్టోరేజికి వెళ్లింది గానీ అప్పటికి ప్రయాణాల ధ్యాస, మన చుట్టూ ఉండే సమాజాన్ని చూసే కోణం పరిచయమవ్వలేదు. కరోనా నుంచి ప్రతి సంవత్సరం కెపాసిటీ పెరుగుతూపోయింది. 2022 లో కట్టకు లీకేజీ పనులు పూర్తి చేసి 17 టీఎంసీల ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ చేర్చారు.
    2023 లో తక్కువ వర్షపాతం వల్ల తెలుగుగంగకు నీళ్లు రాలేదు. ఈసారైనా బయటపడకపోదా, నేను చూడకపోతానా అంటూ గత నవంబర్ రాణిబాయి, రేకలకుంట, బాలాజీ నగర్ మీదుగా డ్యాం బ్యాక్ సైడ్నుంచి వెళ్లాం. అప్పటికి నీళ్లు పూర్తిగా తగ్గలేదు. చేపల వాళ్ల తెప్పల్లో పోదామంటే వాళ్లు కూడా లేరు. ఇలా కాదని గుడ్డివీరయ్య సత్రం, గంగాయపల్లె మీదుగా బయల్దేరాం. గంగాయపల్లె చెరువులో చేపలు పట్టే శీను సాయంతో జీవీసత్రం - బ్రహ్మంగారి మఠం పాత దారి వెంట అడవిలో వెళ్లేసరిగి పొద్దుగుంకింది. వెన్నెలునింది గానీ గుట్టకు పడమటి వైపు కూడా నీళ్లుండడంతో వెళ్లడం కుదర్లేదు.
    దానికి ఇప్పుడు మోక్షం దొరికింది.
    ఎండ ఒకటే దరువేస్తోంది.
    అక్కడ ఇద్దరున్నారు. భర్త రామంజనేయులు, భార్య లచ్చుమ్మ. ఆశగా అంత దూరం పరుగు పరుగున వస్తే ఈసారికి కూడా నారాయణస్వామి మఠానికి దర్శన భాగ్యం దక్కలేదు. ఇంకా నీళ్లల్లో మునిగే ఉంది. అయితే దాని పక్కన చెట్లు మాత్రం బయటపడ్డాయి.
    పొద్దన్నుంచి అన్నీ అపశకునాలే జాగ్రత్త అంటున్న మా వాళ్ల మాటలు మా జిజ్ఞాసను ఆపడంలేదు. ఇంత దూరమొచ్చి ఊరకెందుకు పోవడం తెప్పలో ఆ చెట్ల కాడికి తీసప్పొమ్మని బంగప్పడితే ఇద్దరూ కదిలారు. సుబ్బారెడ్డి, సునీలన్న అక్కడే ఆగితే రామంజనేయులు, లచ్చుమక్కతో పాటు అరణ్యశేఖర్, గోవర్ధనన్న, నేను బయల్దేరాం. మా రాకను గమనించిన బుడ కోళ్లు చెట్ల కొమ్మలు వదిలి భారంగా రెక్కలమింద ఎగిరిపోతున్నాయి. నీటి ఉపరితలం మీద తక్కువ ఎత్తులో అవి ఎగరడం భలే ఉంటుంది చూడ్డానికి.
    నా మనసులో తొలిసారి నీళ్లు ఆక్రమిస్తున్నప్పుడు ఇదే చెట్ల కొమ్మలమింద బితుకు బితుకుమంటూ కోతులు అరుస్తున్న దృశ్యాలే కళ్ళముందు కదలాడుతున్నాయి.
    ఇంకో అయిదారు అడుగులు తగ్గితే గానీ బయపడదంట గుడి గోపురం గుడి ఉన్న ప్రదేశంలో లచ్చుమక్క కొడుకు టెంకాయ కొట్టి, దండ వేశాడు. దండ పచ్చగానే ఉంది. వాళ్ల గురించి అడిగాను. వయసు యాభైకి దగ్గరగా ఉంటాయి. యానాదోళ్లే. అసలు ఊరు మఠం అంట. ఇక్కడ చేపల కోసం వచ్చారు. గుడిసె కూడా లేదు. వల, బుట్ట వాళ్ల ఆస్థి. ఒక్కోసారి రోజుకు రెండొందలు వస్తుందంట, ఒక్కసారి అయిదారొందలు వస్తుందంట. వెయ్యి వచ్చిందంటే మహా భాగ్యమన్నట్టు.
    "ఇంత దూరమొస్తే చేపల కూర వండిపెట్టకపోతివి గదా లచ్చుమక్కా..!" అని నిష్టూరమాడితే "అంత మాటెందుకులే బంగారు నాయనా "ఈసారి పొద్దన్నే రాండి మీకు కావాల్సిన చేప వండిపెడ్తా" అని ఫోన్ నెంబర్ ఇచ్చారు.
    డబ్బులివ్వబోతే ఈ పనికి కూడా డబ్బులియ్యాల్నా అని తగల్నే తగల్లేదు. మీ బిడ్డలమనుకో లచ్చుమక్కా అని బలవంతంగా చేతిలో పెడితే కాదనలేక తీసుకుంది. ఆ కొద్ది సమయంలో ఎంత అభిమానం, ఎంత ఆప్యాయత చూపించారు.
    ఒక పున్నమి రోజు వెళ్లి లచ్చుమక్క వండిపెట్టిన చేపలు తింటూ, వెన్నెల రాత్రిలో చల్లిన గాలిని, బ్రహ్మసాగర్ అలలను ఆస్వాదించాలి అనుకుంటూ బండ్లు బలవంతంగా కదిలించాం.

ความคิดเห็น • 17

  • @kesavamadhava8464
    @kesavamadhava8464 9 หลายเดือนก่อน +1

    Very nice

  • @PeddapothuSudhakarnaidu
    @PeddapothuSudhakarnaidu 9 หลายเดือนก่อน +1

    Supar Good work keep it up

  • @Janakhi_Bhakti_Vibes
    @Janakhi_Bhakti_Vibes 9 หลายเดือนก่อน +1

    నారాయణ స్వామి మఠం బయట పడితే మరోసారి చూడాలని ఉంది😊, కానీ బయట పడిందంటే కరువు కంటిన్యూ అయినట్టే... 😢 చూద్దాం.... వీడియో చాలా RISK చేసి తీసారన్నా, Hats off to UR TEAM

    • @intothenature246
      @intothenature246  9 หลายเดือนก่อน

      Thank you anna 🙏
      ఇంకో నెలలో బయట పడవచ్చు అనుకుంటున్నాను.

  • @KadapaPavanReddy
    @KadapaPavanReddy 9 หลายเดือนก่อน +1

    Super

  • @Dileepkumar-py3cz
    @Dileepkumar-py3cz 9 หลายเดือนก่อน +1

    Brahma sagar aeriel view chaala bagundi. super. Hope we will get an opportunity to visit the submerged Narayanaswamy mutt one day..

    • @intothenature246
      @intothenature246  9 หลายเดือนก่อน

      Thank you, will plan one day anna

  • @ktsvenky3061
    @ktsvenky3061 9 หลายเดือนก่อน +1

    Nice video

  • @saimanisreekarreddy796
    @saimanisreekarreddy796 9 หลายเดือนก่อน +1

    Nice video anna

  • @Prashna-ప్రశ్న
    @Prashna-ప్రశ్న 9 หลายเดือนก่อน +1

    బ్రహ్మ సాగర్ ని మీకన్నా గొప్పగా ఇంకెవరు చూపించేలేరేమో బ్రదర్..

  • @PeddapothuSudhakarnaidu
    @PeddapothuSudhakarnaidu 9 หลายเดือนก่อน +1

    I have that video brother you want